Saturday, December 17, 2016

*మనిషి చనిపోయిన తర్వాత ఎందుకు దహనం చేస్తారో తెలుసా..?*

ప్రకృతి చాలా విచిత్రమైంది. అద్భుతమైంది కూడా. తాను తయారుచేసిన దానిని, తానే నాశనం చేసే ఆటోమేటిక్ సిస్టమ్ ను నేచర్ తయారుచేసుకుంది. మనిషి తయారుచేసినవి తప్ప, ప్రకృతి సహజసిద్ధంగా తయారుచేసే ఈ పదార్ధాన్నైనా, ఎటువంటి సంకోచం లేకుండా మళ్లీ తనలో కలిపేసుకుంటుంది. దీనికి మానవశరీరం అతీతం కాదు. ఐదు ప్రకృతి శక్తులు నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. ఇవే భూమ్మీద ఉన్న జీవ కోటికి ఆధారం. వీటి నుంచే మానవశరీరం పురుడుపోసుకుంది. అందుకే, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దేహాన్ని ప్రకృతిలోనే కలిపే పద్ధతే దహన సంస్కారం..!

మనం పుట్టక ముందు లోకంలో మనకు సంబంధించినవేవీ లేవు. అలాగే మనం పోయిన తర్వాత కూడా, మనకు సంబంధించినవేమీ ఈ ప్రపంచంలో మిగలకూడదు అనే కాన్సెప్టే శవదహనం. దహనం ద్వారా అతని శరీరాన్ని పూర్తిగా అంతం చేయడం దీని వెనుక అర్ధం. ప్రపంచంలో ఒక్కో నిముషానికి లెక్కలేనంత మంది పుడుతుంటారు. లెక్కలేనంత మంది పోతుంటారు. మరి శవాన్ని పూడుస్తూ వెళ్తుంటే, కొంత కాలానికి మనుషులు ఉండే చోటుకంటే, శవాలు ఉండటానికి కావాల్సిన చోటే చాలా ఎక్కువ అవసరంగా మారుతుంది. బహుశా ఈ విషయాన్ని ముందే గ్రహించారో ఏమో కానీ, ప్రాచీన భారతీయులు శరీరదహనం పద్ధతినే పాటించేవారు.

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారీ దేవీ, కుంతీ దేవి వానప్రస్థాశ్రమానికి చేరుకున్నారు. మానవ జీవితంలో ఆఖరున వచ్చేది వానప్రస్థాశ్రమమే. ఆ ఆశ్రమ నియమం ప్రకారం దట్టమైన అడవుల్లో తపస్సు చేసుకుంటూ, కందమూలాలు తింటూ వారు బ్రతికేవారు. ఒక రోజు అడవిలో అగ్ని రాజుకుంది. శరవేగంగా మొత్తం అడవిని కబళించేస్తున్న అగ్నిని చూసి కూడా ఆ ముగ్గురూ బెదరలేదు. సంతోషంగా అగ్నికి ఆహుతైపోయారు. అయితే అంతకంటే ముందు, ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతిలతో అగ్నిలో సంభవించే మరణానికి ఎంత ప్రాశస్త్యముందో, ఏ విధంగా ఉత్తమ గతులు ప్రాప్తించగలవో చెబుతాడు.

పంచభూతాల నుంచి ఏర్పడిన శరీరాన్ని, అవే పంచభూతాల్లో కలిపేయడమే దహనసంస్కారాల ఆచారం వెనుక ఉన్న ప్రధాన కారణం. ప్రాణం విడిచిన దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తారు. అలా కాలి భస్మంగా మారే పద్ధతిలో, ఆకాశంలో, గాలిలో శరీరం కలుస్తుంది. ఇక భస్మం కూడా భూమిలో మట్టిగా మారి కనుమరుగవుతుంది. ఆచారం పాటించేవారు ఆ భస్మాన్ని నీటిలో కలుపుతారు. దీంతో పంచభూతాలతో శరీరం తిరిగి ఐక్యమవుతుంది. ఇక అగ్ని, గంగానది..ఈ రెండూ ఈ లోకంలో అత్యంత పవిత్రమైనవి, పునీతమైనవి అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సమర్పించినవి దేవతలకు అందించేవాడు అని అగ్నికి, దేవతల దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి పాపాలు కడుగుతుందని గంగకు పేరు. ఈ కారణం చేతనే బ్రతికినంత కాలం పాప భూయిష్టమైన మానవ శరీరాన్ని పవిత్రుడైన అగ్నికి ఆహుతిచ్చి, ఆ తర్వాత మిగిన చితాభస్మాన్ని పరమ పావని గంగలో కలిపేసి, ఆ వ్యక్తికి ఉత్తమగతులు సిద్ధించాలని ప్రార్ధిస్తారు. ఇదీ దహన సంస్కారాల వెనుక ఉన్న అసలు కారణం...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment